Sunday, May 30, 2010

నీ స్వప్నం

నడక చివరి శూన్యం లోంచి
అడుగుల క్రింద నలిగిన ఆలోచనల్లోంచి . .
అలల పరుగుతో వచ్చి చెక్కిలి నిమిరిన చిరుగాలి
నీ జ్జ్ఞాపకమే . .
నీవు లేని ఆలోచన, నీతో రాని వసంతం
అర్ధాంతరం . . అసంపూర్ణం . .
కాలం వెంట దేహం పరిగెడుతున్నా
యవ్వనమక్కడే ఆగిపోయింది నీకోసం . .
గుండెను గులాబీ మొక్కకు గుచ్చి ఉంచాను
నువ్వొస్తే తుంచి తలలో పెట్టుకొంటావని . . .
పెదాల మీద ఎండి పోతున్న ఈ పువ్వు
నీ నవ్వే . .
గొంతులో చిధ్రమవుతున్న ఈ పదాలు
నీ మాటలే . .
కనుల మీద చీకటి ఆరబోసిన ఈ దృశ్యం
నీ చూపే . .
జీవితానికి తలుపులు మూయలేదింకా
కలని కౌగలించుకొందామని . .
సుతి మెత్తని అడుగులతో నువ్వొస్తావనే ఆశతోనే . .
నా స్వప్నానికి శిలువ వేయలేదింకా . .తెల్లవారిపోయింది

ఇదిగో తెల్లవారిపోయింది
రాత్రి కన్నా కలలన్నీ పారి పోయాయి
మళ్లీ జీవన సమరం తప్పదు
రాత్రి కై నా ఈ నిరీక్షణా తప్పదు
అయినా . . ఈ వెన్నెల ఇలా కాలుస్తుందెం . .
నీ జ్జ్ఞాపకాల పేజీలు తిరగేస్తున్నా నిద్ర రాదేం . .
కలలో కూడా నిన్ను కలవనివ్వకుండా పన్నిన కుట్రే ఇది . . .
మద్యలో ఒక మలయ మారుతం
నన్ను స్పృశిస్తూ చల్ల గా జారుకుంది
మళ్లీ నీ స్మృతుల నావలో ప్రయాణిస్తూ నిద్ర లోనికి జారుకొంటా . .
కానీ ఏం లాభం . .
నీతో తనివి తీరా మాట్లాడకుండానే
తిరిగి తెల్ల వారిపోయింది.

Monday, May 24, 2010

ప్రయాణం

నేస్తం . . .
ఈ జీవితం ఒక అంతు లేని సముద్రం
ఇందులో ఉవ్వెత్తున ఎగసి పడే ఆశ నిరాశ ల అలలు
అంధకారం లోనికి నెట్టే అగాధాలు
తరుముకొచ్చే తుఫానులు
బాధల సుడిగుండాలు కష్టాల కెరటాలూ
ఎన్ని వున్నా
నేను మాత్రం ఈ జీవిత సంద్రం లో
ధైర్యమనే చిన్ని నావ మీద
ఆశలే తెరచాపగా
చిరునవ్వు చుక్కాని తో
కడవరకూ నా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తా
గమ్యం చేరుతాననే నమ్మకం తో . .


నీ చిరునవ్వు

ఊరంతా నిద్దరోయినా
నేను మాత్రం వేచివున్నా
ఒంటరి నక్షత్రం లా
ఎందుకో తెలుసా . . .
నీ చిరునవ్వుల జల్లు లో తడిసి ముద్దవ్వాలని
ఈ రేయి ఇలా మిగిలి పోవాలని . . .

నీకోసం . . . .

ఆకాశాన్ని ఆదమరిచి
చీకటిని పారద్రోలి
చంద్రుని సాయమడిగి
నక్షత్రాల కళ్ళతో
విశ్వమంత ఆశతో
చూస్తున్నా . . . నే నెదురు చూస్తున్నా
నీకోసం కేవలం నీకోసం . . . .

ఆమె నవ్వెను

ఆమె నవ్వెను
చెట్లన్నీ హరితమాయే
ఆమె నవ్వెను
నదులు రాగములు తీసే
నగ్న నిశి ఐన నేమి . . ఆ నవ్వుతాకి
కట్టకుండునా వెన్నెల పట్టు చీరె
నాదు చేరుమాలందు ఆ నవ్వు తెరల
పరచి ఇచ్చిన దామె
ఇంపార దాని నలదు కొనగా . .
ఎంత హాయి కలిగే . .
అలసటంతయూ చేరుమాలందు కొనెను
గొంతులోనున్న రాగాల కోటి
ఆమె నవ్వు దివ్వె లో మునిగి స్నానాలు చేసే
సురలు ఆ గానము విని అచ్చెరువు నొందె
మా రసాంభుది భువికెట్లు చేరెనంచు . . .

కొత్త దారి

శూన్యం లోంచి నడక . . వెనక ఎవరూ లేరు . .
ముందెవరూ కనబడడం లేదు . .
పాతబాటలన్నీ మూసుకు పోయినట్లున్నాయి
ఇదో కొత్త దారి
చూడబోతే ఎవరూ నడిచి నట్లు లేదు
ఎంత నడిచినా తరగడం లేదు
ఎటు పోతుందో తెలీదు . . .
నేనొకడినే . . నిద్ర పోతున్న ఈ నేల మీద . .అలసిన పాదాలే నాకు తోడుగా . .

naaku nacchina tilak kavitha

నా లోపల ఎవరో చప్పున . .
ఇటునుండి అటు వెళ్ళిపోతూ . .
ఆనవాలు గా వదులుతారు ఇరవై ఏళ్ళ నాటి జ్జ్ఞాపకాలని
నా గది అవతల ఎవ్వరో నవ్వుని తొక్కిపట్టిన ధ్వని . . నీళ్ళని కలచినట్లు
మంచు మసక వెన్నెల కలిసిన శీతాకాలపు రాత్రి . .
గుండెల మీద మరకలా పడుతుంది ఓ నిట్టూర్పు . .
ఏకాంతం మీద అది నా తీర్పు . .